MEDY | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): మరణించిన వారికి తిరిగి ప్రాణంపోయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు ఏండ్లుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటివరకూ ఏదీ విజయవంతం కాలేదు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి.. మరణించిన వ్యక్తి మెదడును కాపాడలేకపోవడమే. అయితే, చైనాలోని ఫుడాన్ వర్సిటీ పరిశోధకులు తాజాగా అభివృద్ధిచేసిన సరికొత్త క్రయోజెనిక్ ఫ్రీజర్ వ్యవస్థ.. మరణించిన వారికి ప్రాణం పోయాలన్న ఆశలకు కొత్త ఊపిరిని ఇస్తున్నది.
ఏమిటీ వ్యవస్థ?
అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మెదడు కణజాలాన్ని గడ్డకట్టేలా చేసి, తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేలా చేయడానికి సాయపడే క్రయోజెనిక్ ఫ్రీజర్ను చైనాలోని ఫుడాన్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి ‘మేడీ’గా నామకరణం చేశారు. మేడీ ఫ్రీజర్ నుంచి తీసిన అనంతరం మెదడులోని నాడీవ్యవస్థ పాడవ్వకుండా ఉండటమే కాకుండా గతంలో పనిచేసినట్టుగానే అన్ని విధులను నిర్వహిస్తున్నట్టు పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ చిచెంగ్ షో చెప్పారు.
మెదడు ఎందుకంత ప్రత్యేకం?
చనిపోయిన మనిషిలోని అన్ని అవయవాలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలు ఉన్న క్రయోజెనిక్ ఫ్రీజర్లలో పెట్టి ఎన్నేండ్లయినా భద్రపరుచవచ్చు. అయితే, మెదడును అలా భద్రపర్చడం కుదరదు. దీనికి కారణం మెదడు కణజాలం 80 శాతం మేర నీరుతో నిండి ఉండటమే. ఒకవేళ, మెదడును సాధారణ బాడీ ఫ్రీజర్లలో పెట్టి భద్రపరిస్తే, మెదడు కణజాలంలోని నీరు గడ్డకట్టి నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకొచ్చినప్పుడు మెదడు మునుపటి విధులను నిర్వర్తించలేదు. దీంతో ప్రత్యేకమైన క్రయోజెనిక్ ఫ్రీజర్ అవసరం ఏర్పడింది.
మేడీలో ప్రత్యేక రసాయనాలు
మేడీలో మెదడును భద్రపర్చేప్పుడు మిథైల్సెల్యూలోజ్, ఇథైలిన్ైగ్లెకోల్, డీఎమ్ఎస్వో, వై27632 వంటి ప్రత్యేక రసాయనాలను తగుపాళ్లలో వినియోగించినట్టు ప్రొఫెసర్ చిచెంగ్ షో తెలిపారు. అందుకే మెదడు పాడవ్వలేదని పేర్కొన్నారు. కాగా, తాజా పరిశోధనతో మెదడును కూడా భద్రపరిచే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన మనిషికి పునఃప్రాణం పోసే క్రతువులో ఇదో కీలక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.
బాడీ ఫ్రీజర్లకు డిమాండ్
మరణించిన తర్వాత తమ శరీరాన్ని భద్రపర్చుకోవడానికి ప్రపంచ కుబేరులు ఆసక్తి కనబరుస్తున్నారు. చనిపోయిన మనిషికి ప్రాణంపోసే సాంకేతికత అభివృద్ధి జరిగితే తాము మళ్లీ బతుకవచ్చన్న ఆశే వారిని ఇలా చేస్తున్నది. ఈ జాబితాలో పీటర్ తేయెల్ వంటి కుబేరులు, స్టీవ్ ఓకీ వంటి సెలబ్రెటీలూ ఉన్నారు. ఇప్పటికే వీళ్లు బాడీ ఫ్రీజర్లకు ఆర్డరిచ్చారు కూడా. కాగా, జీవంలేని శరీరాన్ని ప్రత్యేక ఫ్రీజర్లో భద్రపర్చాలంటే కనీసం రూ. 24 లక్షల వరకూ ఖర్చుచేయాల్సిందే.
Steve