Himalayan glaciers : వాతావరణ మార్పులతో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మానవాళికి త్వరలోనే మరో ముప్పు ఎదురవ్వనుంది. ఏడాదికేడాది పెరిగిపోతున్న భూతాపం కారణంగా హిమాలయ ప్రాంతంలోని మంచు వేగంగా కరుగుతోంది. ఫలితంగా భారీగా వరదలు సంభవించే అవకాశముందని అడ్వాన్సింగ్ ఎర్త్ స్పేస్ సైన్స్ (AGS) అధ్యయనం హెచ్చరిస్తోంది. గత పదేళ్లుగా అక్కడి గ్లేషియర్స్ పరిమాణం తగ్గుతూ వస్తోందని ఇది భవిష్యత్లో తీవ్ర విపత్తులకు దారి తీయనుందని ఏజీయూ స్టడీ పేర్కొంది. ఫలితంగా అక్కడి సింధు, యాంగ్జే, అము డార్యా, సిర్ దర్యా వంటి నదుల్లో పది శాతం నీటి పరిమాణం పెరిగిందని వెల్లడించింది.
‘హిమానీ నదుల్లో నీటి శాతం పెరగడం వల్ల స్వల్ప కాలికంగా జలవిద్యుఛక్తి, వ్యవసాయానికి లాభదాయకంగా ఉంటుంది. కానీ, దీర్ఘ కాలికంగా గ్లేసియర్స్ అనేవి కనుమరుగు అవుతాయి. నదీ వ్యవస్థకు రక్షణలా ఉండే ఇవి కుచించుకుపోవడం వల్ల భవిష్యత్లో నీటి లభ్యతలో ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయం. అంతేకాదు జలచరాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది’ అని మసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీర్ జొనాథన్ ఫ్లొరెస్ అన్నాడు.
హిమాలయ ప్రాంతంలోని మంచుపై కాలుష్యం ప్రభావం – మానవాళిపై దాని దుష్ఫరిణామాలపై ఏజీయూ పరిశోధకులు అధ్యయనం చేశారు. హిమాలయ ప్రాతంలోని నదీ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులను నోట్ చేశారు. వీళ్ల స్టడీ ప్రకారం 2100 నాటికి హిమానీనదాల శాతం 29 నుంచి 67 శాతం వరకూ తగ్గే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. క్లోరోఫ్లోరో కార్బన్ల కారణంగా భూతాపం పెరుగుతుండడం వల్ల మంచు కరిగి నదుల్లో నీటి శాతం ఎక్కువవుతోంది. ఫలితంగా నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు తీవ్ర దుష్ఫరిణామలు ఎదుర్కోంటారని ఏజీయూ పరిశోధకులు అంటున్నారు.