Blood | న్యూఢిల్లీ: మలేరియాకు కారణమై ఏటా వేలాది మందిని బలితీసుకుంటున్న దోమలపై సరికొత్త అస్ర్తాన్ని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా.. మన రక్తం తాగుతున్న మలేరియా దోమలకు మన రక్తంతోనే చెక్‌పెట్టే విధానాన్ని కనుగొన్నారు. మనుషుల రక్తాన్ని మలేరియా కారక దోమలకు విషంగా మార్చడంలో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. మనుషుల రక్తంలోకి నిటిసినోన్ ఔషధాన్ని ఎక్కించడం వల్ల మన రక్తం దోమలకు ప్రాణాంతకంగా మారుతుందని తమ అధ్యయనంలో తేల్చారు.
అరుదైన జన్యు వ్యాధుల చికిత్స కోసం నిటిసినోన్ను వాడతారు. అయితే దీనివల్ల కలిగే అనుకోని సైడ్ ఎఫెక్ట్స్ దోమలకు ప్రాణాంతకమని.. ఈ ఔషధాన్ని వాడుతున్న రోగులపై పరిశోధన చేసిన సైంటిస్టులు ఇటీవల కనుగొన్నారు. ఈ ఔషధం రోగుల జీవక్రియలకు దోహదం చేయగా.. అదే సమయంలో ఆ రోగుల రక్తం తాగిన దోమల జీర్ణక్రియకు విఘాతం కలిగి 12 గంటల వ్యవధిలో అవి మరణించినట్లు వారు గుర్తించారు. నిటిసినోన్ దీర్ఘ కాలం పని చేస్తుందని.. ఇది మనుషులకు, పర్యావరణానికి ఎలాంటి హాని చేయదని వారు తెలిపారు.