న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న యాత్రకు న్యాయవ్యవస్థే అతి పెద్ద అడ్డంకి అని వ్యాఖ్యానించిన ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్పై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. సన్యాల్ వ్యాఖ్యలను బాధ్యతారాహిత్యం, అనుచితంగా అభివర్ణించిన వికాస్ సింగ్ న్యాయస్థానాల పనితీరుపై ఆయన అవగాహనారాహిత్యం బయటపడుతోందని ఎద్దేవా చేశారు.
భారతదేశ అభివృద్ధికి ఏర్పడుతున్న అవరోధాలకు న్యాయవ్యవస్థ కారణమని అనడం అపరిపక్వతగా ఆయన పేర్కొన్నారు. నిజానికి వ్యవస్థలో లోపాలకు ప్రభుత్వమే కారణమని సింగ్ తెలిపారు.