ముంబై: సుమారు 17 ఏళ్ల విరామం తర్వాత స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన తొలి విమానం భారత్‌కు ప్రయాణమైంది. ముంబైలో వెల్కమ్ ల్యాండింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆ విమానం మధ్యలోనే యూ టర్న్ తీసుకుని వెనక్కి వెళ్లిపోయింది. (Scandinavian Airlines) జూన్ 2న స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఏఎస్)కు చెందిన ఎస్కే 969 ఫ్లైట్ డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది. సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో తన కార్యకలాపాల విస్తరణ ఆశతో ఉన్న ఆ సంస్థ తొలి విమానం ముంబైకు ప్రయాణమైంది. ఆ విమానం తొలి ల్యాండింగ్ సందర్భంగా స్వాగతం పలికేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని గ్రౌండ్ సిబ్బంది వాటర్ కెనాన్ సెల్యూట్ కోసం సిద్ధమై వేచి ఉన్నారు.
కాగా, విమానం బయలుదేరడానికి ముందు భారత్ నుంచి తుది అనుమతులు స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు అందలేదు. ఫ్లైట్ టేకాఫ్ తర్వాత అనుమతుల ప్రక్రియ పూర్తవుతుందని ఆ సంస్థ భావించింది. అయితే ల్యాండింగ్ అనుమతుల అంశంలో స్పష్టత లేకపోవంతో ఆ విమానం మధ్యలోనే యూటర్న్ తీసుకున్నది. ఈ నేపథ్యంలో సుమారు 12 గంటల పాటు అందులో ప్రయాణించిన ప్రయాణికులు తిరిగి బయలుదేరిన కోపెన్హాగన్లోనే దిగారు.
మరోవైపు ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. వారికి ప్రత్యామ్నాయ విమాన ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. భారత్ నుంచి మిగిలిన అనుమతులు పొందేందుకు సంబంధిత ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. వారానికి ఐదుసార్లు నడిచే కోపెన్హాగన్- ముంబై సర్వీసును కొన్ని రోజుల్లోనే పునఃప్రారంభిస్తామని వెల్లడించింది.
అయితే భారత్‌కు తొలి విమాన సర్వీసులో అంతరాయం కారణంగా స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. ఇంధనం, నిర్వహణ ఖర్చులు, ప్రయాణికులకు నష్టపరిహారం కోసం అర మిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లవచ్చని నిపుణులు అంచనా వేశారు. భారత్‌కు తొలి సర్వీసులోనే ఆ సంస్థకు నిరాశ, భంగపాటు ఎదురైనట్లు పేర్కొన్నారు.