సోమవారం 25 జనవరి 2021
National - Jan 02, 2021 , 16:54:27

బీజేపీ ఎమ్మెల్యే భవనం కూల్చివేతపై కోర్టు స్టే

బీజేపీ ఎమ్మెల్యే భవనం కూల్చివేతపై కోర్టు స్టే

డెహ్రాడూన్‌: బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన భవనం కూల్చివేతపై సుప్రీంకోర్టు రెండు వారాలు స్టే ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే  ప్రదీప్ బాత్రా స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూమిలో 2015 నుంచి అక్రమంగా భవన నిర్మాణ పనులు చేపట్టారు. గౌరవ్ పుండిర్ అనే వ్యక్తి 2017లో దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. మున్సిపల్‌ అధికారులు పలు నోటీసులు ఇచ్చినప్పటికీ అక్రమ నిర్మాణాలను ఆయన కొనసాగించారని అందులో ఆరోపించారు. ఈ పిల్‌పై విచారణ జరిపిన ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఎమ్మెల్యే బాత్రా చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్‌ అధికారులను ఇటీవల ఆదేశించింది. 

మరోవైపు ఈ తీర్పుపై స్టే కోరుతూ ఎమ్మెల్యే బాత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మున్సిపల్‌ అధికారులు పరిశీలించి అక్రమ నిర్మాణాలుగా తేల్చితే తానే స్వయంగా వాటిని కూల్చివేస్తానని చెప్పారు. లేనిపక్షంలో పోలీసుల భద్రత మధ్య అధికారులే కూల్చివేయవచ్చని కోర్టుకు తెలిపారు. అయితే ఎమ్మెల్యే బాత్రా ఇదే విషయాన్ని హైకోర్టుకు చెప్పాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం శనివారం తెలిపింది. ఆయన విన్నపంపై హైకోర్టే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై రెండు వారాలు స్టే విధించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo