న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, బీహార్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ఆనంద్ మోహన్‌ను ముందస్తుగా విడుదల చేయడంపై వివరణ కోరుతూ.. బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన ఖైదీని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందని నోటీసులలో ప్రశ్నించింది. కాగా, బీహార్ ప్రభుత్వం 2012 నాటి ప్రిజన్ మాన్యువల్‌ను గత నెల 10న సవరించింది. ఆ సవరణ మేరకు గత నెల 27న 14 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవించిన 27 మంది ఖైదీలను విడుదల చేసింది.
ఆ 27 మందిలో IAS అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ కూడా ఉన్నాడు. దాంతో ఆనంద్ మోహన్ ముందస్తు విడుదలను సవాల్ చేస్తూ కృష్ణయ్య భార్య ఉమ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. గోపాల్‌గంజ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న IAS అధికారి జీ కృష్ణయ్య 1994లో హత్యకు గురయ్యారు. ఆనంద్ మోహన్ ముఠానే ఆ హత్య చేయించింది.
అప్పట్లో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2007లో మోహన్ ఆనంద్‌కు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. దానిపై ఆనంద్ మోహన్ హైకోర్టును ఆశ్రయించడంతో.. బీహార్ హైకోర్టు ఆ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఆపై ఆనంద్ మోహన్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లినా దేశ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు విధించిన శిక్షను తగ్గించడానికి నిరాకరించింది. అప్పటి నుంచి సహర్ష జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆనంద్ మోహన్‌ను బీహార్ ప్రభుత్వం రూల్స్‌ను మార్చి విడుదల చేసింది.