Sanjay Raut : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన నేత కుమారుడు (Shinde Sena Leader’s Son) మద్యం సేవించి బీఎండబ్ల్యూ కారు డ్రైవ్ చేస్తూ స్కూటర్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మహిళ మరణించగా ఆమె భర్త గాయపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న శివసేన నేత కుమారుడి కోసం వెతుకుతున్నారు. ఇక ఈ ఘటనపై శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ స్పందించారు.
యూపీలోని వారణాసిలో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గూండాల ముఠా నడుపుతున్నదని తీవ్ర విమర్వలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పాయని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలు సజావుగా సాగితే మిహిర్ షాను వారు అరెస్ట్ చేయాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. కాగా, పాల్ఘడ్ జిల్లాకు చెందిన శివసేన డిప్యూటీ లీడర్ రాజేష్ షా కుమారుడైన 24 ఏళ్ల మిహిర్ షా శనివారం రాత్రి జూహులోని ఒక బార్లో మద్యం సేవించాడు.
ఆదివారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వెళ్తుండగా లాంగ్ డ్రైవింగ్‌కు వెళ్దామని డ్రైవర్‌తో అన్నాడు. కాగా, వర్లీ ప్రాంతానికి చేరగా కారు తాను డ్రైవ్ చేస్తానని మిహిర్ షా పట్టుబట్టాడు. బీఎండబ్ల్యూను వేగంగా నడిపిన అతడు స్కూటర్‌పై వెళ్తున్న చేపలు అమ్ముకునే భార్యాభర్తలను ఢీకొట్టాడు. వర్లీలోని కోలివాడ ప్రాంతానికి చెందిన కావేరి కారు కింద నలిగి మరణించగా ఆమె భర్త ప్రదిక్ తీవ్రంగా గాయపడ్డాడు. మరోవైపు ఈ ప్రమాదం తర్వాత శివసేన నేత కుమారుడు మిహిర్ షా అక్కడి నుంచి పారిపోయాడు.
Read More :