Thackeray Cousins : రెండు దశాబ్దాల తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు థాక్రే సోదరులు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ చేయి చేయి కలిపిన ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లనున్నారు. ఇకపై ఇద్దరం కలిసే ఉంటామని ప్రకటించిన ఈ ఇద్దరూ ముంబైలో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారని శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు.
‘థాక్రే సోదరులు ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారు. ముంబై, థానే, నాసిక్ కల్యాణ్ – దింబివల్లీలో కలిసే బరిలోకి దిగి విజయం సాధిస్తారు. ఉద్ధవ్, రాజ్ థాక్రేల బలం మరాఠీ మాట్లాడే ప్రజల ఐక్యతకు ప్రతిరూపం. ఏ అధికార శక్తి కూడా మరాఠి యోధులను విడదీయలేదు’ అని రౌత్ మీడియాకు వెల్లడించారు.
త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబైలో ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే (Raj Thackeray) ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. 2005లో విడిపోయిన ఈ ఇద్దరు అన్నదమ్ములు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలుసుకోవడం మహా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అన్నదమ్ముల కలయికపై ఇరు పార్టీల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
VIDEO | Mumbai, Maharashtra: After two decades, the estranged Thackeray cousins — Uddhav and Raj — share public stage as they jointly hold a “mega victory gathering” to celebrate the Maharashtra government’s roll back of the three-language policy in primary schools.… pic.twitter.com/vrPgQu7ltB
— Press Trust of India (@PTI_News) July 5, 2025
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వల్లే తాము కలిశామని రాజ్ థాక్రే వ్యాఖ్యానించారు. సీఎం రాష్ట్రానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమే తమని కలిపిందన్నారు. అనుకోకుండానే ఒకే వేదికపై చేర్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై థాక్రే సోదరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇకపై తామిద్దరం ఒక్కటిగా ఉంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, అన్నదమ్ములిద్దరూ చివరి సారిగా 2005లో ఒకేవేదికపై కనిపించారు. ఆ తర్వాత శివసేనలో గొడవల కారణంగా రాజ్ థాక్రే పార్టీ వీడారు. 2006 మార్చి 9వ తేదీన సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను స్థాపించారు