న్యూఢిల్లీ, జూలై 14: ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించి స్థూలకాయం, అసాంక్రమిక వ్యాధులను నిరోధించే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమోసా, జిలేబీ, కచోరీ, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, గులాబ్ జామూన్, వడాపావ్, శీతల పానీయాలు తదితర స్నాక్స్‌లో ఉండే చక్కెర, నూనె పరిమాణాన్ని వెల్లడిస్తూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.
స్థూలకాయాన్ని ఎదుర్కోవడంపై రోజూ గుర్తు చేసేందుకు అన్ని లెటర్ హెడ్లు, ఎన్వలప్‌లు, నోట్ప్యాడ్లు, ఫోల్డర్లు, ప్రచురణలు వంటి ఆఫీస్ స్టేషనరీపై ఆరోగ్య సందేశాలు ముద్రించాలని కూడా ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. నూనె బోర్డులో ఫ్రెంచ్ ఫ్రైలు, బర్గర్లు, పిజ్జా, సమోసా, పకోడీ, వడాపావ్ వంటి తినుబండారాలలో నూనె పరిమాణం, చక్కెర బోర్డులో శీతల పానీయాలు, గులాబ్ జామూన్, జిలేబీ వంటి తీపి పదార్థాలలోని చక్కెర పరిమాణం ఉండాలని ఆరోగ్య శాఖ తెలిపింది. నూనె, షుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ -నాగపూర్‌కు కూడా ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది.
పొగాకు తరహాలోనే ఈ చిరుతిండ్లను కూడా పరిగణించేందుకు ఇది తొలి అడుగుగా ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్య ముప్పునకు సంబంధించి ఈ తినుబండారాలన్నిటినీ ఒకే తరహాలో పరిగణించాల్సి ఉంటుందని అనుబంధ శాసనాలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మిలింద్ దేవ్రా స్పష్టం చేశారు.