INDIA Bloc | న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఇండియా కూటమిలో చిచ్చు రేగింది. హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూటమిని విచ్ఛిన్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ తీరు పట్ల కూటమిలోని ప్రాంతీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఆ పార్టీ పొత్తు ధర్మం పాటించకుండా, రాష్ర్టానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నాయి. తమ బలంతో కాంగ్రెస్ లాభపడుతున్నదని, తమ భుజాలపై రాజకీయంగా ఊరేగుతున్నదే కానీ ఆ పార్టీతో పొత్తు వల్ల తమకు కలిగే ప్రయోజనం సున్నా అనే అభిప్రాయానికి వస్తున్నాయి. కాంగ్రెస్ అహంకారం, అతివిశ్వాసం వల్లే బీజేపీ ఒక్కో రాష్ట్రంలో గెలుస్తున్నదని భావిస్తున్నాయి. దీంతో ఒక్కో పార్టీ ఇండియా కూటమికి దూరం జరుగుతున్నాయి. కాంగ్రెస్ను ఇక మోయలేం అని చెప్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆదరణ కోల్పోతున్నదని, కేవలం తమ బలాన్ని ఉపయోగించుకొని మనుగడ సాధిస్తున్నదని ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీహార్లో ఆర్జేడీ, తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) వంటి పార్టీలతో పొత్తు కాంగ్రెస్కు చాలా కలిసొచ్చింది. కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరగడానికి తమ బలమే కారణమని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. తాజాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 56 సీట్లు పోటీ చేసి 42 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్కు 32 సీట్లు కేటాయిస్తే ఆరు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ బలంతోకశ్మీర్ ప్రాంతంలోనే ఐదు స్థానాలను గెలిచింది. ఇంత ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ భాగమవుతున్నది. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అసంతృప్తిగా ఉంది.
కాంగ్రెస్తో కలిసివెళ్తే బీజేపీని ఎదుర్కోలేమనే ఒక అభిప్రాయానికి ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న తప్పులు, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పాలనా వైఫల్యాలు తమ మెడకు చుట్టుకొంటాయనే ఆందోళనతో ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్తో పొత్తు అంటే మునిగిపోయే పడవలో ప్రయాణం చేయడమే అని భావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తీరుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి నుంచి ఆ పార్టీ దాదాపుగా తప్పుకున్నట్టే. ఢిల్లీలో ఆప్, యూపీ ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఆర్జేడీ, శివసేన సైతం కాంగ్రెస్ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాయి. దీంతో ఇండియా కూటమి అనే పేరు కొనసాగుతున్నప్పటికీ అందులో ఏయే పార్టీలు ఉన్నాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.
జమ్ముకశ్మీర్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్సీ 42 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి, కూటమి పార్టీలైన కాంగ్రెస్, సీపీఎం మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తి మెజారిటీ సాధించింది. అయితే కూటమిలో ఆరు సీట్లతో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్కు ఇండిపెండెంట్లు షాకిచ్చారు. నలుగురు స్వతంత్రులు తాము ఎన్సీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఎన్సీ బలం 46కు చేరింది. దీంతో కాంగ్రెస్కు ప్రాధాన్యం తగ్గిపోయింది. భవిష్యత్తులో ఆ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని కొనసాగించే బలం ఎన్సీకి ఏర్పడింది. మరోవైపు, ఎన్సీ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.