జైపూర్ : రాజస్ధాన్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. రాహుల్ యాత్ర వేదికగా సీఎం అశోక్ గహ్లోట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గాల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. భారత్ జోడో యాత్రలో ఆదివారం సచిన్ పైలట్ మద్దతుదారులు ఆయనకు మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు.
సచిన్ పైలట్ జిందాబాద్, మన సీఎం ఎలా అంటే సచిన్ పైలట్‌లా ఉండాలని వారు నినదించారు. ఒక రోజు విరామం అనంతరం జోడో యాత్ర దౌసాలో 14వ రోజు పున:ప్రారంభమైంది. సచిన్ పైలట్‌కు అనుకూలంగా ఆయన వర్గీయులు నినాదాలు చేసిన సమయంలో రాహుల్ వెంట పైలట్, అశోక్ గహ్లాట్లున్నారు.
ఇక సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇప్పటివరకూ తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల మీదుగా రాజస్ధాన్‌లో ప్రస్తుతం కొనసాగుతోంది. శుక్రవారం నాటికి రాహుల్ యాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 24న భారత్ జోడో యాత్ర ఢిల్లీ చేరుకోనుండగా ఎనిమిది రోజుల అనంతరం పున:ప్రారంభమవుతంది. రాహుల్ యాత్ర ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్ మీదుగా చివరిగా జమ్ము కశ్మీర్లో ముగుస్తుంది.