Sabarimala | శబరిమల మండల మకరవిలక్కు సీజన్సందర్భంగా ఈ నెల 16న అయ్యప్పస్వామి తెరుచుకోనున్నది. నాటి నుంచి రెండు నెలల పాటు వర్చువల్ క్యూ విధానంలో ప్రతిరోజూ 30 వేల మంది భక్తులకు అనుమతి ఇస్తారు. అంతకుముందు 15న ఆలయ ప్రధాన అర్చకులు కందరారు మహేశ్ ఆధ్వర్యంలో మరో అర్చకుడు వీకే జయరాజ్.. గుడిని తెరుస్తారు. ఆ మరుసటి రోజు నుంచి భక్తులను అనుమతి ఇస్తారు. డిసెంబర్ 26న మండల పూజ ముగుస్తుంది. వచ్చేనెల 30న మకరవిలక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే రోజు 20న ఆలయాన్ని మూసివేస్తారు. అయితే కరోనా నేపథ్యంలో దైవ దర్శనానికి వచ్చే భక్తులకు కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని ఆలయం అధికారులు తెలిపారు. ఇందుకు మార్గదర్శకాలు జారీ చేశారు.
రెండు డోస్‌ల టీకా తీసుకున్న వారు ఆ సర్టిఫికెట్ అధికారులకు చూపాలి. లేనిపక్షంలో శబరిమలను దర్శించుకోవడానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చిన వారిని అనుమతిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకుని రావాలి.. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఆధార్ నంబర్ (ఒరిజినల్) అట్టిపెట్టుకోవాలి.
పంపానదిలో స్నానానికి అనుమతి ఉన్నా.. పంపా, సన్నిధానంలో బస చేయడానికి అనుమతి లేదు. పంపాలో వాహన పార్కింగ్‌కు అనుమతించరు. దర్శనం తర్వాత పంపా వద్ద ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇక దైవదర్శనం జరిగిన వెంటనే ఆలయ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని ఆలయ అధికారులు తెలిపారు.