న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త చీఫ్‌గా ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు. ఈ నెల 14న పదవీ కాలం ముగియనున్న ప్రస్తుత చీఫ్ కే శివన్ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శి, స్పేస్ కమిషన్ ఛైర్మన్‌గా ఎస్ సోమనాథ్‌ను కేంద్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేండ్లు ఆ పదవిలో ఆయన కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
భారీ ఉపగ్రహాల ప్రయోగాలకు వినియోగించే GSLV Mk-III లాంచర్ అభివృద్ధిలో ఎస్ సోమనథ్ కీలకపాత్ర పోషించారు. కెరీర్ ప్రారంభ దశల్లో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ఇంటిగ్రేషన్ టీమ్ లీడర్‌గా ఆయన ఉన్నారు. 2018 జనవరి 22 నుంచి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఎస్ సోమనాథ్, కొల్లాంలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డ్రిగీ పొందారు. 1985లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరారు. ‘స్ట్రక్చర్స్’ ఎంటిటీకి డిప్యూటీ డైరెక్టర్‌గా, నవంబర్ 2014 వరకు VSSCలో ‘ప్రొపల్షన్ అండ్ స్పేస్ ఆర్డినెన్స్ ఎంటిటీ’కి డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. 2010 జూన్ నుండి 2014 వరకు GSLV Mk-III ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
అధిక థ్రస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి కార్యకలాపాలలో ఎస్ సోమనాథ్ కీలకంగా వ్యవహరించారు. ఫాస్ట్ ట్రాక్ హార్డ్‌వేర్ రియలైజేషన్, టెస్ట్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. చంద్రయాన్-2 ల్యాండర్ క్రాఫ్ట్ కోసం థ్రోటల్ ఇంజిన్ అభివృద్ధి నుంచి GSAT-9లో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను మొదటిసారిగా విజయవంతం చేయడం వంటి వాటిల్లో కీలక పాత్ర పోషించారు.