న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. త్వరలోనే ఇండియాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు చెందిన తేదీలు దాదాపు ఖరారు అయినట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తెలిపారు. ప్రస్తుతం ధోవల్.. మాస్కోలో ఉన్నారు. అయితే ఈనెల చివరలో ఆ భేటీ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాతో వాణిజ్యం విషయంలో భారత్‌పై అమెరికా అదనపు సుంకం విధిస్తున్న నేపథ్యంలో మోదీ, పుతిన్ భేటీ కీలకం కానున్నది.
భారత్, రష్యా మధ్య రక్షణ, భద్రతా భాగస్వామ్యం అంశాలపై ధోవల్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్-400 సిస్టమ్స్ అంశంలో రష్యాతో ఆయన చర్చించనున్నారు. ప్రస్తుతం ఇండియా వద్ద మూడు ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇటీవల పాక్‌తో జరిగిన ఉద్రిక్తతల వేళ వాటిని వాడారు. గత ఏడాది సెప్టెంబర్‌లోనూ ధోవల్ రష్యాలో పర్యటించారు. ఆ టూరు సమయంలో ఆయన పుతిన్‌తో భేటీ అయ్యారు.
మరో వైపు ట్రంప్, పుతిన్ కూడా భేటీకానున్నారు. ఆ ఇద్దరి భేటీకి వేదికను డిసైడ్ చేసినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. భేటీకి సంబంధించిన వేదిక అంశంలో రెండు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ ఇటీవల మాస్కోలో పర్యటించారు. ఆయన పర్యటన తర్వాత ఇద్దరు అగ్రనేతలకు చెందిన మీటింగ్‌పై అంగీకారం కుదిరినట్లు అంచనా వేస్తున్నారు. ఈ భేటీకి జెలెన్స్కీని కూడా ఆహ్వానించాలని అమెరికా నిర్ణయించింది. కానీ దీనిపై రష్యా స్పందించలేదు.
ఈనెల చివరలో ప్రధాని మోదీ.. చైనాలో పర్యటించనున్నారు. ఆ పర్యటనకు చెందిన నిర్ణయం తీసుకున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అవుతారు. అమెరికా అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.