చెన్నై: తమిళనాడులోని అధికార డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ పత్రంలో రూపాయి చిహ్నాన్ని (Rupee symbol) తొలగించింది. ఆ స్థానాన్ని తమిళ అక్షరంతో భర్తీ చేసింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం, కేంద్రం మధ్య నెలకొన్న భాషా వివాదం కొత్త మలుపు తిరిగింది. అయితే భారత కరెన్సీగా రూపాయి చిహ్నాన్ని రూపొందించింది తమిళనాడుకు చెందిన వ్యక్తే. అది కూడా డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడే.
కాగా, 2010లో రూపాయి చిహ్నాన్ని రూపొందించడానికి నిర్వహించిన జాతీయస్థాయి పోటీకి వందలాది ఎంట్రీలు వచ్చాయి. ఐఐటీ ముంబై పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉదయ కుమార్ ఈ పోటీలో గెలిచారు. దేవనాగరి ‘రా’, రోమన్ ‘ఆర్’ను మిళితం చేసినట్లు ఆయన తెలిపారు. భారతీయ గుర్తింపుతోపాటు సార్వత్రిక గుర్తింపును రూపాయి చిహ్నానికి ఇచ్చినట్లు ఒక ఇంటర్వూలో చెప్పారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2010 జూలై 15న ఈ రూపాయి చిహ్నాన్ని భారత కరెన్సీలో ప్రవేశపెట్టింది.
మరోవైపు రూపాయి చిహ్నాం రూపకల్పన చేసిన ఉదయ కుమార్కు నాడు ప్రశంసలు వెల్లువెత్తాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలోని మారూర్లో ఆయన జన్మించారు. ఉదయ కుమార్ తండ్రి ఎన్ ధర్మలింగం డీఎంకే మాజీ ఎమ్మెల్యే. అనంతరం ఐఐటీ గౌహతిలోని డిజైన్ విభాగంలో కొత్త ఉద్యోగాన్ని ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం డిజైన్ విభాగం అధిపతిగా ఉన్నారు. ఐఐటీ-హైదరాబాద్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వంటి అనేక సంస్థలకు లోగోలను ఆయన రూపొందించారు.
కాగా, తమిళనాడు వ్యక్తి, డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఉదయ కుమార్ రూపకల్పన చేసిన రూపాయి చిహ్నాన్ని రాష్ట్ర బడ్జెట్ పత్రం నుంచి డీఎంకే ప్రభుత్వం తొలగించింది. దీంతో ఈ అంశం బీజేపీకి ప్రధాన అస్త్రంగా మారింది. డీఎంకే ప్రభుత్వం చర్య తెలివి తక్కువదని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై విమర్శించారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొడుకే రూపాయి గుర్తును రూపొందించినట్లు వారు గ్రహించలేదని ఎద్దేవా చేశారు.