RSS leader @ Dargah | ఆర్ఎస్ఎస్ నేత ఒకరు నిజాముద్దీన్‌లోని హజరత్ దర్గాను సందర్శించారు. అన్ని మతాలను గౌరవించడం తప్పనిసరి అని చెప్పిన ఈ ఆర్ఎస్ఎస్ నేత.. ఆక్కడ చాదర్ కప్పి పూలు సమర్పించారు. దీపావళి పండుగకు ఒకరోజు ముందు ఇలా దర్గాను ఆర్ఎస్ఎస్ నాయకుడు సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఢిల్లీలోని మసీదును సందర్శించిన తర్వాత.. ఇంద్రేష్ కుమార్ కూడా దర్గాకు రావడం ప్రాముఖ్యత సంతరించుకున్నది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకుడు ఇంద్రేష్ కుమార్ శనివారం రాత్రి ఢిల్లీ శివారులోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించారు. దర్గాలో చాదర్, పూలు సమర్పించి మట్టి దీపాలు వెలిగించారు. నిజాముద్దీన్ దర్గాలో మట్టి దీపాలు వెలిగించడం వల్ల శాంతి, సౌభాగ్యం, సామరస్య సందేశం వెల్లివిరుస్తుందని ఇంద్రేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆర్ఎస్ఎస్లోని రాష్ట్రీయ ముస్లిం మంచ్‌కు పోషకుడిగా ఇంద్రేష్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గత నెల 22న ఢిల్లీలోని మసీదుకు వెళ్లారు. అక్కడ ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో భేటీ అయ్యారు.
ఎవరూ బలవంతంగా మతం మార్చుకోవద్దని, హింసకు పాల్పడవద్దని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుఆమర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని, కులాన్ని గౌరవిస్తూనే, ఇతరుల కులాన్ని, మతాన్ని గౌరవించడం ద్వారా సమాజంలో సామరస్యత వెల్లివిరుస్తుందన్నారు. ఇతరుల మతాన్ని విమర్శించడం లేదా అవమానించడం గానీ చేయకూడదన్నారు. దేశంలో అన్ని మతాలను గౌరవించినప్పుడే దేశం శుక్రవారం రాళ్లు రువ్వే మతోన్మాదుల నుంచి విముక్తి పొందుతుందని చెప్పారు. అన్ని పండగలు మనకు మతోన్మాదం, దురుద్దేశం, ద్వేషం, అల్లర్లు, యుద్ధం వంటివి వద్దని నేర్పుతాయని తెలిపారు. తాము శాంతి, సామరస్యం, సోదరభావాన్ని కోరుకుంటున్నామన్నారు.