Robert Vadra : హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల (Haryana Election) వేళ ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు నుంచి విడుదల కావడం వెనుక బీజేపీ ప్రమేయం ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయాలన్న లక్ష్యమే ఇందుకు కారణమని ఆయన విమర్శించారు.
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని తేలడంతో 2017లో జైలుకు వెళ్లారు. ఆ కేసులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం రోహ్తక్లోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నికల వేళ ఆయన 20 రోజుల పేరోల్కు దరఖాస్తు చేసుకోగా అనుమతి లభించడం చర్చనీయాంశమైంది. పలు కేసుల్లో నిందితుడైన ఆయనకు రాష్ట్రంలో భారీ అనుచరగణం ఉంది. అందుకే ఎన్నికల వేళ కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు బాబాకు పేరోల్ ఇచ్చారని వాద్రా విమర్శించారు.
డేరాబాబాతోపాటు కేజ్రీవాల్ కూడా ఎన్నికల ప్రచారం సమయంలోనే తీహార్ జైలు నుంచి బయటకు రావడం లాంటి పరిణామాలు వెనుక భాజపా హస్తం ఉన్నదనేది తన అభిప్రాయమని రాబర్ట్ వాద్రా తెలిపారు. వీరిద్దరూ కాంగ్రెస్ విజయావకాశాలకు గండి కొట్టగలరని బీజేపీ అనుకుంటోందని చెప్పారు. తనకు సంబంధించిన కంపెనీ ద్వారా హర్యానాలో ఉద్యోగాలు కల్పించగలనన్న విశ్వాసాన్ని రాబర్ట్ వాద్రా వ్యక్తంచేశారు.
తాను హర్యానాలో యువతకు ఉద్యోగాలు ఇవ్వగలనని, ఈ ప్రభుత్వం తన సహచరులను బెదిరింపులకు గురిచేయడంతో వారు దూరంగా వెళ్లిపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో తాను పని చేయడం కష్టమని, ఆర్థికంగా తనను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాద్రా ఆరోపించారు. ఈ ఎన్నికల్లో హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారని, తద్వారా భారీ మెజారిటీ వస్తుందనే విశ్వాసం తనకు ఉన్నదని వాద్రా వ్యాఖ్యానించారు.