లక్నో: బీహార్‌లో ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ (Ritlal Yadav) దానాపూర్ కోర్టులో లొంగిపోయారు. దానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన బలవంతపు వసూళ్లు, ఫోర్జరీ, చంపుతానంటూ బెదిరించడం వంటి ఆరోణలు ఎందుర్కొంటున్నారు. గతకొంతకాలంగా పరారీలో ఉన్న ఎమ్మెల్యేతోపాటు ఆయన సన్నిహితులైన చిక్కు యాదవ్, పింకూ యాదవ్, శ్రమణ్ యాదవ్ కూడా కోర్టు ముందు లొంగిపోయారు.
పాట్నాలోని ఒక బిల్డర్‌ను డబ్బు డిమాండ్ చేయడం, హత్య చేస్తామని బెదిరించారు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్‌తోపాటు ఐదుగురిపై కేసు నమోదుచేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 11న పాట్నా, దానాపూర్‌లోని నిందితులకు సంబంధించిన 11 ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.10 లక్షలకుపైగా నగదు, రూ.77 లక్షల మోత్తానికి చెందిన చెక్కులు, ఆరు ఖాళీ చెక్కులు, ఆస్తుల అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన 14 పత్రాలు, ఆరు పెన్‌డ్రైవ్‌లు, వాకీ చాకీ, 17 చెక్‌బుక్‌లు లభించాయి. వాటన్నింటినీ సీజ్ చేసిన పోలీసులు.. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. గత కొన్నిరోజులుగా చంపుతామంటూ నిందితుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పాట్నాకు చెందిన ఓ బిల్డర్ తమకు ఫిర్యాదు చేశారని జిల్లా ఎస్పీ అవ్కాష్ కుమార్ తెలిపారు. నిందుత కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేతోపాటు నిందితులు కోర్టులో లొంగిపోవడం గమనార్హం.