న్యూయార్క్, డిసెంబర్ 31: మునుపెన్నడూ చూడనివిధంగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తీరప్రాంతంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. గత మూడు రోజులుగా తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న నివాసాలపై సముద్రపు అలలు వరుసగా విరుచుకుపడుతున్నాయి. వీటి ప్రభావంతో చాలా వాహనాలు కొట్టుకుపోగా, వివిధ చోట్ల జరిగిన ప్రమాద ఘటనల్లో పలువురు గాయపడ్డారు. అలలు సుమారు 20 నుంచి 40 అడుగుల ఎత్తులో వస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బీచ్‌లకు సమీపంలో ఉన్న వీధులు, ఇండ్లు, వ్యాపార సముదాయాలు భీకరమైన అలల తాకిడి ప్రభావానికి లోనయ్యాయి. స్థానిక హోటల్స్ గ్రౌండ్ ఫ్లోర్ గదులన్నీ ధ్వంసమయ్యాయని ఫైర్ కెప్టెన్ బ్రియాన్ మెక్‌గ్రాత్ మీడియాకు తెలిపారు. అత్యంత ఎత్తుతో హఠాత్తుగా వస్తున్న సముద్ర అలలతో దక్షిణ, మధ్య కాలిఫోర్నియా తీరప్రాంతంలో భయానక వాతావరణంనెలకొన్నదని, ప్రజలెవ్వరూ బీచ్‌లకు వెళ్లవద్దని స్థానిక అధికారులు హెచ్చరించారు.