RG Kar Case | ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి యాజమాన్యం 51 మంది వైద్యులకు నోటీసులు జారీచేసింది. బుధవారం విచారణ కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ప్రజాస్వామ్య వాతావరణాన్ని ప్రమాదంలో పడేశారని.. బెదిరింపు సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని.. పని వాతావరణాన్ని పాడు చేశారంటూ నోటీసుల్లో పేర్కొంది. కమిటీ ఎదుట తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిందేనని ఆసుపత్రి అథారిటీ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆర్జీ కర్ హాస్పిటల్ ప్రత్యేక కౌన్సిల్ కమిటీ నిర్ణయం ప్రకారం 51 మంది వైద్యులను విచారణ కమిటీ పిలిపించే వరకు ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.
నోటీసులపై ఆసుపత్రి ప్రిన్సిపాల్ సంతకాలు చేశారు. కాలేజీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు నోటీసులో పేర్కొన్నారు. ఈ జాబితాలో సీనియర్ రెసిడెంట్స్, హౌస్ స్టాఫ్, ఇంటర్న్స్, ప్రొఫెసర్లు ఉన్నారు. ఆర్జీ కర్ ఆసుపత్రిలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య అనంతరం ఆగస్టు 9 నుంచి జూనియర్ వైద్యులు నిరసన చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో పాటు పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్లో నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు ఆర్జి కర్ ఆసుపత్రిలో మరణించిన వైద్యుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమ ‘వర్క్ సమ్మె’ కొనసాగుతుందని చెప్పారు.
అయితే మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని వైద్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్యులు విధుల్లో చేరకుంటే వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఈ మేరకు సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఈ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో సమర్పించింది. బెంగాల్ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును కూడా కోర్టులో దాఖలు చేసింది. వైద్యులు పనిచేయక 23 మంది మరణించారని అందులో పేర్కొన్నారు. విచారణ అనంతరం కోర్టు సీబీఐని కొత్త స్టేటస్ రిపోర్టును కోరింది. విచారణ సంస్థకు కోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.