Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు చిక్కుల్లో పడ్డారు. జన్ సురాజ్ పార్టీని స్థాపించి ఏ పొత్తూ లేకుండా ఒంటిరిగా బరిలో నిలిచిన కిషోర్‌కు రెండు రాష్ట్రాల్లో ఓటు ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. బీహార్‌లోని కర్గహార్ అసెంబ్లీ నియోజకవర్గంలో, పశ్చిమబెంగాల్లోని భవానీనగర్ అసెంబ్లీ స్థానంలో ఆయన ఓటరుగా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కర్గహార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ కిషోర్‌కు లేఖ రాశారు. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో మీరు ఓటరుగా ఎందుకు పేరు నమోదు చేసుకున్నారో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ లేఖలో ఆదేశించారు. ఆయన నేరుగాగానీ, ఆయన తరఫున ఎవరైనాగానీ హాజరై వివరణ ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
‘2025 అక్టోబర్ 28న ప్రచురితమైన వార్త ప్రకారం.. మీ పేరు బీహార్, పశ్చిమబెంగాల్ రెండు రాష్ట్రాల్లో ఓటరుగా ఉన్నది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ తరఫున మూడు రోజుల్లో మా ముందు హాజరు కావాలి. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఎందుకు ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారో వివరణ ఇవ్వాలి’ అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తన లేఖలో ఆదేశించారు.