చండీఘడ్: నకిలీ ఎన్కౌంటర్(Fake Encounter) కేసులో మాజీ ఎస్పీకి పదేళ్ల జైలుశిక్ష విధించింది సీబీఐ కోర్టు. పంజాబ్‌లోని బియాస్లో ఎస్‌హెచ్‌వోగా చేసిన పరంజిత్ సింగ్‌కు ఈ శిక్ష పడింది. అతని వయసు 67 ఏళ్లు. 1993లో ఇద్దరు కానిస్టేబుళ్లను అమృత్‌సర్‌లో ఫేక్ ఎన్కౌంటర్ చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎస్పీగా అతను రిటైర్ అయ్యాడు. ఈ కేసులో మరో ముగ్గుర్ని దోషులుగా తేల్చింది కోర్టు. ఇన్స్పెక్టర్ ధరంసింగ్, ఏఎస్ఐ కశ్మీర్ సింగ్, ఏఎస్ఐ దర్బారా సింగ్‌లను దోషులుగా ప్రకటించారు. ఈ కేసులో మరో నిందితుడు ఎస్ఐ రామ్ లుబియా .. విచారణ సమయంలో మృతిచెందాడు.
కానిస్టేబుల్ సుర్ముక్ సింగ్, కానిస్టేబుల్ సుఖ్విందర్ సింగ్‌ను 1993, ఏప్రిల్ 18వ తేదీన పోలీసులు తీసుకెళ్లారు. వాళ్లను అక్రమంగా బంధించారు. ఆ తర్వాత మజీతా పోలీసులు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను ఫేక్ ఎన్కౌంటర్లో చంపేశారు. నాలుగు రోజుల తర్వాత ఆ ఇద్దరి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. సుర్ముక్ను అప్పటి ఇన్స్పెక్టర్ పరంజిత్ సింగ్, సుఖ్విందర్ను ఎస్ఐ రామ్ లుబియా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఓ స్కూటరు చోరీ కేసులో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను విచారించారు.
నాలుగు రోజుల తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లను కాల్చి వేసినట్లు మజీతా పోలీసు ధరం సింగ్ ప్రకటించారు. ఎన్కౌంటర్ అంశంలో విచారణ అవసరం లేదని పోలీసులు ఆ కేసును క్లోజ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1995, డిసెంబర్ 26వ తేదీన ఈ కేసులో సీబీఐ విచారణ మొదలుపెట్టారు. బాధితుల పేరెంట్స్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దర్ని సుఖ్విందర్, సుర్ముక్గా సీబీఐ విచారణలో తేల్చారు. 1997, ఫిబ్రవరి 28వ తేదీన సీబీఐ కేసును రిజిస్టర్ చేసింది. 1999లో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ధరం సింగ్, పరంజిత్ సింగ్ పేర్లను చేర్చారు.
2001 నుంచి 2022 వరకు నిందితులు ఈ కేసులో పలు పిటీషన్లు వేశారు. ఈ కేసులో కేవలం 27 మంది సాక్షుల వాంగ్మూలం మాత్రమే తీసుకున్నారు.