న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశంలో మనుషులు తినే ఆహారమే కాదు.. పాడి పశువుల కడుపు నింపే ఆహారమూ కరువవుతున్నది. గోధుమలు, బియ్యం, పప్పు దినుసులు, చక్కెర కొరత తర్వాత ఇప్పుడు దేశంలో దాణా కొరత తీవ్రమవుతున్నది. ఈ విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రతియేటా ఇవే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏదైనా కొరత ఏర్పడినప్పుడు ఎగుమతులను నిషేధించడం మినహా ఉత్పత్తిని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి.
దేశంలో దాణా కొరత తీవ్రమవుతున్న విషయాన్ని కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ బుధవారం పార్లమెంటులో వెల్లడించారు. పచ్చి దాణాకు 11.24 – 32 %, ఎండు దాణాకు 23% కొరత ఉందని ఝాన్సీలోని ఐసీఏఆర్ – ఇండియన్ గ్రాస్లాండ్ అండ్ ఫాడర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐజీఎఫ్ఆర్ఐ) అంచనా వేసిందని ఆయన తెలిపారు. కొరత కారణంగా దాణా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో పాడి రైతులకు పశుపోషణ భారంగా మారుతున్నది. దాణా ధరలు పెరగడం వల్ల పాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇది ప్రజలందరిపైనా భారం మోపుతున్నది.
బియ్యం, చక్కెర విషయంలోనూ కొరత వేధిస్తున్నది. దీంతో ప్రభుత్వం కొన్ని రకాల బియ్యం, చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దేశంలో చెరుకు ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గి కొరత ఏర్పడుతున్నది. అక్టోబరుతో ముగియనున్న 2024-25 సీజన్‌కు సంబంధించి చెరుకు దిగుబడి గత ఏడాది కంటే తగ్గవచ్చని ఇండియన్ షుగర్ మిల్స్ ఆండ్ బయో ఎనర్జీ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ అంచనా వేసింది. ఇక, కొన్ని రకాల బియ్యానికి కూడా దేశంలో కొరత ఉంది. ఫలితంగా గత ఏడాది కాలంగా బియ్యం ధరలు భారీగా పెరిగిపోయాయి.
పప్పుదినుసులకు కూడా దేశంలో కొరత ఏర్పడుతున్నది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం క్రమంగా పెరుగుతున్నది. 2022-23లో 24.96 లక్షల టన్నుల పప్పుదినుసులను దిగుమతి చేసుకోగా, 2023-24లో ఇది దాదాపు 90 శాతం పెరిగి 47.38 లక్షల టన్నులను దిగుమతి చేసుకున్నట్టు ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది.
దేశంలో రెండేండ్లుగా గోధుమల కొరత పెరగడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొరతను నివారించడానికి ప్రభుత్వం 2022లో గోధుమల ఎగుమతులను నిషేధించింది. 2023లోనూ గోధుమల ఉత్పత్తి ప్రభుత్వ అంచనాల కంటే 10 శాతం తగ్గింది. ఇక, 2024లో 112 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమల ఉత్పత్తి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేయగా, రోలర్ ఫ్లౌర్ మిల్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం 105 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే ఉంటుందని పేర్కొన్నది.