ఘజియాబాద్: ఆర్డర్ ఆలస్యం అయ్యిందని ఏకంగా హోటల్‌నే ధ్వంసం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో (Ghaziabad) చోటుచేసుకున్నది. రాత్రి 11.30 గంటల సమయంలో ఘజియాబాద్‌లోని అప్నీ రసోయ్ అనే రెస్టారెంట్‌కు కొందరు యువకులు వచ్చారు. వారికి కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేశారు. అయితే ఆహారం తీసుకురావడంలో ఆలస్యం కావడంతో వారు హోటల్ సిబ్బందితో గొడవదిగారు. తీవ్ర వాదోపవాదాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కొద్ది సేపటి తర్వాత ఆరేడు మందితో కలిసి మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు హోటల్లో విధ్వంసం సృష్టించారు. కట్టెలు, ఇనుప రాడ్లతో ల్యాప్‌టాప్‌లతోపాటు ఎల్ఈడీ స్క్రీన్, బిల్లింగ్ మిషన్‌ను పగలగొట్టారు. ఫర్నీచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. కౌంటర్లో ఉన్న రూ.1760 ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో హోటల్లో ఉన్న మహిళలు, చిన్నారులు సహా పలువురు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో పరుగులు తీశారు. ఇదంతా హోటల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కాగా, ఈ ఘటనపై హోటల్ యజమాని అక్షిత్ త్యాగీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగులను గుర్తించేదుకు ప్రయత్నిస్తున్నారు.