కోల్కతా: హత్యాచారానికి గురైన కోల్కతా వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ వైద్యులకు సంఘీభావంగా ఆర్జీ కర్ దవాఖానకు చెందిన సుమారు 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం జరిగిన విభాగాధిపతుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాల, దవాఖాన సీనియర్ వైద్యులు కూడా రాజీనామాలు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఓ సీనియర్ డాక్టర్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ వైద్యుల సంయుక్త వేదిక జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్షకు మద్దతు పలికింది.
హమ్సఫర్ ప్రారంభం
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: దేశ జాతీయ రహదారుల వెంబడి అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ఉద్దేశించిన ‘హమ్ సఫర్’ విధానాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఇందులో భాగం గా హైవేల వెంబడి మరుగు దొడ్లు, శిశు సంరక్షణ గదులు, చక్రాల కుర్చీలు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ స్థలాలు, ఇంధన స్టేషన్ల వద్ద విశ్రాంతి సేవలు వంటి సదుపాయాలను కల్పించనున్నారు.
సౌకర్యవంతమైన, సురక్షితమైన, ఆనందకర అనుభవాన్ని ఈ విధానం అందిస్తుందని కేంద్రం తెలిపింది.
కొత్తగా 10 ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా 10 ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయబోతున్నట్టు కేంద్రం తెలిపింది. అలాగే ఈఎస్ఐ కార్పొరేషన్ లబ్ధిదారులకు అమలుజేస్తున్న నిరుద్యోగ భృతి పథకం అమలును 2026 జూన్ వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నది. తాజా సమావేశంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పై నిర్ణయాలు ప్రకటించారు. పీఎంజైఏవై ఎంప్యానెల్డ్ దవాఖానాల్లోనూ ఈఎస్ఐసీ లబ్ధిదారులకు వైద్య సేవలు అందించాలని కేంద్రం నిర్ణయించింది.