రాంచీ, నవంబర్ 11: ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ.. జార్ఖండ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో వివిధ వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను 60 శాతం నుంచి 77 శాతానికి పెంచుతూ సీఎం హేమంత్ సొరేన్ సర్కార్ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో జార్ఖండ్‌లో పోస్టులు, సేవల ఖాళీల రిజర్వేషన్ చట్టం-2001 సవరణలతో కూడిన బిల్లును పాస్ చేసింది.
ఇందులో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఇస్తున్న రిజర్వేషన్లను 60 శాతం నుంచి 77 శాతానికి పెంచారు. రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో మార్పులు చేయాలని జార్ఖండ్ ప్రభుత్వం బిల్లు ద్వారా కేంద్ర సర్కార్‌ను కోరింది. ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం, ఎస్సీలు 12 శాతం, ఎస్టీలు 28 శాతం, ఈబీసీలు 15 శాతం, ఓబీసీలు 15 శాతం కోటా పొందనున్నారు. ఇక, ఇతర రిజర్వేషన్ల క్యాటగిరీల నుంచి మినహాయించే ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్టీలు 26%, ఎస్సీలు 10%, ఓబీసీలు 14% రిజర్వేషన్లు పొందుతున్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు.