(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ఇంగ్లండ్ శాస్త్రవేత్తల బృందం కొత్త బ్లడ్ గ్రూప్‌ను కనిపెట్టింది. దీనిని ‘మాల్’గా వ్యవహరిస్తున్నది. 1972లో గుర్తించిన ఏఎన్డబ్ల్యూ యాంటిజెన్ ప్రొటీన్‌కు కారణం ఈ బ్లడ్ గ్రూపేనని ఇంగ్లండ్‌లోని ఎన్హెచ్ఎస్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు తెలిపారు. తాజా పరిశోధనతో 50 ఏండ్ల మిస్టరీని ఛేదించామన్న పరిశోధకులు.. క్లిష్టమైన చికిత్సలు, రక్త మార్పిడిలో ఏర్పడే సమస్యలకు ఈ కొత్త బ్లడ్ గ్రూప్ సులభంగా పరిష్కారం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏ, బీ, ఏబీ, వో, ఆర్‌హెచ్.. ఇలా ప్రపంచంలో ఇప్పటివరకూ 47 రకాల బ్లడ్ గ్రూప్‌లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతీ బ్లడ్ గ్రూప్‌లో ఏదో ఒక యాంటిజెన్ ఉంటుంది. ఈ ప్రొటీన్‌ను బట్టే వ్యక్తి రక్తం ఏ రకానిదన్న విషయం తెలుస్తుంది. అయితే, 1972లో తొలిసారిగా ఏఎన్డబ్ల్యూ యాంటిజెన్ అనే కొత్త ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, అప్పటికే ఉన్న బ్లడ్ గ్రూప్‌లలో ఏ గ్రూప్‌నకూ ఈ ప్రొటీన్ సరిపోలలేదు. దీంతో ఈ యాంటిజెన్ ఉన్న వేలాది మందికి అత్యవసరమైన చికిత్స చేయడం సాధ్యపడలేదు. రక్తమార్పిడి చేసే సమయంలో సమస్యలు ఎదురయ్యేవి. అయితే, తాజా పరిశోధనలో ఏఎన్డబ్ల్యూ యాంటిజెన్ ప్రొటీన్ ‘మాల్’ అనే కొత్త బ్లడ్ గ్రూప్‌నకు చెందినదని శాస్త్రవేత్తలు గుర్తించారు.