న్యూఢిల్లీ, మార్చి 12: ప్రపంచంలో అత్యధికంగా భారత్లోనే ‘జీరో ఫుడ్’ చిల్డ్రన్ ఉన్నారని, 67 లక్షల మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని ‘హార్వర్డ్ స్టడీ’ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 92 దేశాల్లో అధ్యయనం చేయగా, సగం మంది బాలలు భారత్లోనే ఉన్నారని నివేదిక పేర్కొన్నది. ‘జీరో ఫుడ్’ చిల్డ్రన్ దేశాల్లో భారత్ తర్వాత నైజీరియా (9,62,000 మంది బాలలు), పాకిస్థాన్ (8,49,000), ఇథియోపియా (7,72,000), డీఆర్ కాంగో (3,62,000) ఉన్నాయి. రోజులో ఎలాంటి ఆహారం, కనీసం తాగడానికి పాలు కూడా దొరకని పరిస్థితుల్లో చిన్నారులుంటే (6-23 నెలల వయసు) వారిని ‘జీరో ఫుడ్’ చిల్డ్రన్గా పేర్కొంటారు. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా, బెనిన్, లైబీరియా, మాలీ దేశాల్లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దీనికి ఏమాత్రమూ తీసిపోని అధ్వాన పరిస్థితిలో భారత్లో 67లక్షల మంది బాలలున్నారని, ఇది 92 దేశాల్లో మొత్తం ‘జీరో ఫుడ్’ చిల్డ్రన్ సంఖ్యలో సగానికి సమానమని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హార్వర్డ్ సెంటర్ ఫర్ పాపులేషన్, డెవలప్మెంట్ స్టడీస్ సైంటిస్టు రాక్లి కిమ్, ప్రొఫెసర్ ఎస్వీ సుబ్రమణియన్, 2,76,379 మంది బాలలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. అయితే ఈ నివేదికను కేంద్రం ఖండించింది.