చెన్నై, అక్టోబర్ 19: తమిళనాడు దివంగత సీఎం జయలలితకు అందించిన వైద్యంపై తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని ఆమె సన్నిహితురాలు శశికళ పేర్కొన్నారు. జయలలితకు అందించిన వైద్యం, మరణంపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్ముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదికపై శశికళ బుధవారం తీవ్రంగా స్పందించారు. జయలలిత వైద్యం విషయంలో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు.
‘ఈ విషయంపై నా అభిప్రాయాలను తెలియజేసేందుకు నేను మెడిసిన్ చదువలేదుకదా. అక్కకు ఎలాంటి మందులు, చికిత్స అందించాలో వైద్యబృందం నిర్ణయించింది’ అని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అనారోగ్యంతో దవాఖానలో చేరిన జయలలిత చికిత్స పొందుతూ 2016 డిసెంబర్లో కన్నుమూశారు. అయితే, ఆమె మరణంపై అనుమానాలు రేకెత్తడంతో అప్పటి సర్కారు జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ తాజాగా రాష్ట్ర సర్కారుకు తన నివేదికను సమర్పించింది. దాన్ని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. జయలలిత మరణం, ఆమెకు అందించిన వైద్యం విషయంలో కమిషన్ మొత్తం 8 మందిపై అభియోగాలు మోపింది. ముఖ్యంగా శశికళ చెప్పినట్టుగానే జయలలితకు వైద్యం అందిందని కమిషన్ అనుమానం వ్యక్తంచేసింది.