లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. కాషాయ శ్రేణులతోపాటు కొందరు హిందూ స్వామీజీలు కలిసి దాదాపు 10 ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించారు. వారణాసిలోని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించాలని సనాతన రక్షక దళ్ (ఎస్ఆర్డీ), బ్రాహ్మిణ్ సభ కలిసి కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగానే విగ్రహాలను తొలగిస్తున్నారు. తాము సాయిబాబాకు వ్యతిరేకం కాదని, కాకపోతే ఆయన విగ్రహాలకు మాత్రం ఆలయాల్లో చోటు లేదని ఎస్ఆర్డీ అధ్యక్షుడు అజయ్‌శర్మ పేర్కొన్నారు. సాయిబాబా కోసం ఏర్పాటు చేసిన ఆలయాల్లో ఆయన భక్తులు పూజలు నిర్వహించుకోవచ్చని, సనాతన ధర్మంపై ఏమాత్రం అవగాహన లేని కొందరు ఇతర ఆలయాల్లోనూ సాయిబాబా విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సూర్యుడు, విష్ణువు, శివుడు, శక్తి, గణేశుడి విగ్రహాలను మాత్రమే ఆలయాల్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.