న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాంలీలా మైదానంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మన్జీందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, రవిందర్ ఇంద్రాజ్ సింగ్, పంకజ్ సింగ్ సైతం ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, భారీగా బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం సచివాలయంలో రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం మొదటి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 14 కాగ్ రిపోర్టులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఇందులో నిర్ణయం తీసుకున్నారు. కాగా, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. ఆర్థిక, రెవెన్యూ శాఖలను సీఎం రేఖా గుప్తా తన వద్ద ఉంచుకున్నారు.
వికసిత్ ఢిల్లీ కోసం ఒక్క రోజు కూడా వృథా చేయకుండా తన ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేఖా గుప్తా చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, మార్చి 8న మహిళా దినోత్సవం నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. గత పదేండ్లలో ఢిల్లీ ప్రజల సొమ్ముకు గత ఆప్ ప్రభుత్వాన్ని జవాబుదారీగా మారుస్తామని తెలిపారు.
ఆప్ హయాంలో విపక్ష నేతగా వ్యవహరించి అసెంబ్లీ నుంచి బహిష్కరణ, మార్షల్స్ చేతిలో గెంటివేతకు గురైన మాజీ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ కానున్నారు. 2015, 2016ల్లో ఆయనను మార్షల్స్ సభ నుంచి ఈడ్చుకెళ్లినంత పనిచేశారు. ఆయనను అసెంబ్లీ నుంచి స్పీకర్ బహిష్కరించడంతో మార్షల్స్ బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.