NSDRC | ముంబై: కొనుగోలుదారుకు ఫ్లాట్‌ను స్వాధీనం చేయడంలో తీవ్ర ఆలస్యం చేసిన బిల్డర్‌కు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) గట్టిగా బుద్ధి చెప్పింది. ఫ్లాట్ నిర్మాణం పూర్తి కాకముందే కొనుగోలుదారు నుంచి తీసుకున్న సొమ్ముపై వడ్డీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని పన్వెల్‌లో ఫ్లాట్ కొనుగోలుదారుతో బిల్డర్ 2011 జూలైలో అమ్మకపు ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ఫ్లాట్ విలువ రూ.64,56,768గా నిర్ణయించుకున్నారు. ఒప్పంద సమయంలో కొనుగోలుదారు నుంచి బిల్డర్ రూ.62,63,060 స్వీకరించారు. ఫ్లాట్‌ను 2013 మార్చిలో కొనుగోలుదారుకు స్వాధీనం చేస్తానని బిల్డర్ హామీ ఇచ్చారు.
మిగిలిన సొమ్మును ఫ్లాట్‌ను స్వాధీనం చేసే సమయంలో చెల్లించేందుకు ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది. కానీ బిల్డర్ రకరకాల కారణాలు చెప్తూ ఫ్లాట్ నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. గడువు లోగా ఫ్లాట్‌ను స్వాధీనం చేయకపోవడంతో కొనుగోలుదారు మహారాష్ట్ర రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బిల్డర్ చివరికి 2019 ఫిబ్రవరిలో నిర్మాణం పూర్తి చేసి, ఫ్లాట్‌ను కొనుగోలుదారుకు ఇచ్చారు. అయితే ఆ సమయానికి కొనుగోలుదారు మరణించారు. అయితే కొనుగోలుదారు కొడుకు తండ్రి తరపున కమిషన్‌లో వాదనలు కొనసాగించారు.
ఈ కేసులో బిల్డర్ వాదనలు వినిపిస్తూ, తాను ఫ్లాట్ కొనుగోలుదారుకు పవర్ ఆఫ్ అటార్నీ రాశానని, ఆయన కుమారునికి కాదని వాదించారు. ఈ వాదనలను రాష్ట్ర కమిషన్ తోసిపుచ్చింది. కొనుగోలుదారు నుంచి తీసుకున్న సొమ్ముపై సంవత్సరానికి 20 శాతం వడ్డీని ఆయన కుమారునికి చెల్లించాలని ఆదేశించింది. అదే విధంగా, ఖర్చుల కింద రూ.25 వేలు, మానసిక వేదనకు పరిహారంగా రూ.1 లక్ష చెల్లించాలని తీర్పు చెప్పింది. ఫ్లాట్‌ను రెండు నెలల్లోగా అప్పగించాలని ఆదేశించింది.
అయితే ఈలోగా బిల్డర్ కూడా మరణించడంతో ఈ కేసుపై ఆయన కుమారుడు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)లో అప్పీల్ చేశారు. ఫ్లాట్ కొనుగోలుదారు ఎన్ఆర్ఐ అని, ఆయనకు భారత దేశంలో ఫ్లాట్‌ను కొనే అధికారం లేదని వాదించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి సంవత్సరానికి 20 శాతం వడ్డీ అంటే చాలా ఎక్కువ అని తెలిపారు. దీనిపై ఎన్సీడీఆర్సీ 2024 నవంబరు 6న తీర్పు చెప్తూ, ఎన్ఆర్ఐలు స్వదేశంలో ఇళ్లను కొనవచ్చునని చెప్పింది. ఫ్లాట్ నిర్మాణంలో ఆలస్యానికి బిల్డర్ చెప్తున్న కారణాలు పస లేనివని చెప్పింది.
ఫ్లాట్ స్వాధీనానికి హామీ ఇచ్చిన తేదీ నుంచి ఫ్లాట్‌ను వాస్తవంగా స్వాధీనం చేసిన తేదీ వరకు కొనుగోలుదారు చెల్లించిన సొమ్ముపై సంవత్సరానికి 6 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఈ వడ్డీని 8 వారాల్లోగా చెల్లించాలని, ఆ విధంగా చెల్లించడంలో విఫలమైతే, ఆ తర్వాత సంవత్సరానికి 9 శాతం వడ్డీ రేటుతో చెల్లించాలని స్పష్టం చేసింది. ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని చెప్పింది. అయితే మానసిక వేదనకు పరిహారంగా రూ.1 లక్ష, ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని రాష్ట్ర కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది.