లక్నో: హైవేపై కలకలం చెలరేగింది. రోడ్డు పక్కన రెడ్ సూట్‌కేస్ కనిపించింది. తెరిచి చూసిన కొందరు అందులో మహిళ మృతదేహం ఉండటం చూసి షాక్ అయ్యారు. (woman’s body in suitcase) పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం ఢిల్లీ-లక్నో హైవే పక్కన వదిలేసిన ఎర్రటి సూట్‌కేస్‌ను కొందరు గమనించారు. దానిని తెరిచి చూడగా అందులో కుక్కి ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. దీంతో వారు షాక్ అయ్యారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని సూట్‌కేస్ నుంచి బయటకు తీసి పరిశీలించారు. ఆమె శరీరంపై గాయాలున్నట్లు తెలిపారు. మహిళ వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు. ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు. మహిళ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూట్‌కేస్ ఎవరు వదిలేశారో అన్నది తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.