Brij bhushan singh | న్యూఢిల్లీ, మే11(నమస్తే తెలంగాణ): రెజ్లర్లపై తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని వాధిస్తున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు రెజ్లర్లు గట్టి సవాల్ విసిరారు. తాము చేస్తున్న ఆరోపణలు నిజమేనని లై డిటెక్టర్ నార్కో టెస్టు చేయించుకుంటామని, బ్రిజ్‌భూషణ్ కూడా ఈ టెస్టు చేయించుకోవడానికి సిద్ధమా ? అని రెజ్లర్, ఒలంపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ సవాల్ విసిరారు. దోషి ఎవరో, నిర్దోషి ఎవరో ఈ పరీక్ష ద్వారా తేలుతుందని, బ్రిజ్‌భూషణ్‌కు ఆయన చిత్తశుద్ధిపై నమ్మకముంటే లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న నిరసన కొనసాగుతున్నది. రెజ్లర్లు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి బ్లాక్‌డేగా పాటించారు. రెజ్లర్లకు రైతులు, కార్మికులు మద్దతు తెలిపారు. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసింది.
మైనర్ రెజ్లర్ స్టేట్మెంట్ రికార్డు
బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ రెజ్లర్ స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారు. సీఆర్పీసీ 164 కింద బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
క్రీడా ఫెడరేషన్లకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013 ప్రకారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ లేకపోవడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా తీసుకున్నది. ఈ కమిటీలు లేని డబ్ల్యూఎఫ్ఐతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీసీసీఐ తదితర 15 ఫెడరేషన్లకు నోటీసులు జారీ చేసింది.