RCP Singh | బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీకి సీనియర్ నేత ఆర్సీపీ సింగ్ శనివారం రాజీనామా చేశారు. ఇవాళ ఉదయమే ఆయనపై అవినీతి ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం నోటీసులు జారీ చేస్తూ.. సమాధానం కోరింది. ఈ క్రమంలో ఆయన తన సొంత గ్రామంలో జేడీయూకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన జేడీయూను ‘మునిగిపోతున్న నావ’గా అభివర్ణించారు. ముస్తఫాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంగా.. రాజ్యసభ ఎంపీగా, ఆ తర్వాత కేంద్రమంత్రిగా పని చేసిన సమయంలో తప్పుడు మార్గంలో ఆర్సీపీ సింగ్ స్థిరాస్తులు కూడబెట్టినట్లు జేడీయూ గతంలో ఆరోపించింది. రాజ్యసభ సభ్యత్వం ముగియడంతో గత నెలలోనే ఆర్సీపీ సింగ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఆర్సీపీ సింగ్ మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్ కొనసాగుతూ వస్తున్నది. అయితే, మంత్రిపదవి నుంచి వైదొలగిన తర్వాత సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు చేయడం గమనార్హం.