న్యూఢిల్లీ: ధురంధర్ 2 సినిమా విడుదల తర్వాత దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన భారతీయ గూఢచారుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన రవీంద్ర కౌశిక్ కథ కూడా మళ్లీ వెలుగులోకి వచ్చింది. జర్నలిస్టు అనిరుద్ధ మిత్రా ఒక పాడ్‌కాస్ట్‌లో అతడి భావోద్వేగ కథను వివరించారు. అతనే అసలైన హమ్జా అని ఆయన నమ్ముతున్నారు. రవీంద్ర కౌశిక్ కథ ఎందుకు ముఖ్యమైనదని భాను పాఠక్ పాడ్‌కాస్ట్‌లో రవీంద్ర కౌశిక్‌ని ప్రశ్నించగా ఇది చాలా భావోద్వేగభరితమైన కథ. ఇది ఒక విషాద వీరుడి కథ అని జవాబిచ్చారు. అనిరుద్ధ ఇంకా ఏం చెప్పారంటే..
రవీంద్రకు నాటక రంగంపై అమితాసక్తి. నటుడు కావాలనుకున్నాడు. ఒకరోజు రా(రీసెర్చ్ అనాలిసిస్ వింగ్)కి చెందిన ఒక వ్యక్తి రవీంద్రను కలుసుకుని మీ నాటకాల్లో చాలా దేశభక్తి భావన చూపుతున్నారని, జాతీయ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న మీరు నిజ జీవితంలో ఇలా చేస్తే ఎలా ఉంటుందని అడిగాడు. దానికి రవీంద్ర అంగీకరించారు. పాక్‌లోనే చదివి.. దేశం కోసం ప్రాణాలర్పించి..
గూఢచారిగా శిక్షణ తర్వాత పాకిస్థాన్ చేరుకున్న రవీంద్ర అక్కడే న్యాయ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత పాక్ సైన్యంలో అకౌంట్స్ విభాగంలో ఉద్యోగం సంపాదించాడు. ఆడిటింగ్ పని నిమిత్తం ఓ ఊరెళ్లిన ఆయన ఆ ఊర్లోని ఓ వ్యక్తి కూతురిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. తన భార్య తండ్రి ద్వారా ఆర్మీ అధికారులు హాజరయ్యే పార్టీలకు వెళ్లడం మొదలుపెట్టారు. తన స్నేహ సంబంధాలతో ఆర్మీలో సీనియర్ ర్యాంకు ప్రమోషన్ కూడా రవీంద్ర పొందారు. తాను సేకరించిన సమాచారాన్ని భారత్‌కు చేరవేసేవారు. అయితే 1983లో ‘రా’ కొత్తగా నియమించిన ఓ జూనియర్ గూఢచారి ఐఎస్ఐకి దొరికిపోయాడు. ఇంటరాగేషన్‌లో అతను రవీంద్రను కలుసుకోవాల్సిన ఓ పార్కు పేరు చెప్పేశాడు. దీంతో రవీంద్రను ఐఎస్ఐ పట్టుకుంది. అవును నేను రా ఏజెంట్‌ని. నేను నా విధిని నిర్వర్తించాను. నేను మీకేమీ చెప్పను. మీరు ఏం చేయదలచుకున్నారో చేసుకోండి అని రవీంద్ర ఐఎస్ఐకి తెగేసి చెప్పారు. 1983లో రవీంద్రకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. పోలీసులు ఎన్ని చిత్ర హింసలకు గురి చేసినా నోరు మెదపని ఆ దేశ భక్తుడు చివరకు 2001లో కన్నుమూశారు.