న్యూఢిల్లీ : క్యాన్సర్ కారక ఆందోళనలపై అత్యవసర మందుల జాబితా నుంచి యాంటాసిడ్ సాల్ట్ రానిటిడైన్‌ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. 26 మందులను ఈ జాబితా నుంచి తప్పించింది. అసిలాక్, జినిటాక్, రాంటాక్ బ్రాండ్ల పేరుతో రానిటిడైన్‌ను ప్రముఖంగా విక్రయిస్తున్నారు.
అసిడిటీ, కడుపునొప్పి, గ్యాస్ వంటి జీర్ణ సంబంధ రుగ్మతలకు వీటిని ఎక్కువగా వాడుతుంటారు. కేంద్రం మంగళవారం 384 ఔషధాలతో నూతన అత్యవసర మందుల జాతీయ జాబితా (ఎన్ఎల్ఈఎం) విడుదల చేసింది. ఇక ఈ జాబితా నుంచి తొలగించిన 26 ఔషధాలు దేశంలో ఉనికిలో ఉండవు. క్యాన్సర్ కారక ఆందోళనలపై రానిటిడైన్‌ను ప్రపంచవ్యాప్తంగా పరీక్షిస్తున్నారు.
అత్యవసర మందుల జాబితా నుంచి దీనిని తొలగించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డీసీజీఐ, ఎయిమ్స్‌లతో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. ఇక నూతన అత్యవసర మందుల జాబితా వెల్లడించడంతో ఇన్సులిన్ గ్లర్గైన్ వంటి మధుమేహ ఔషధాలు, డెలమనిడ్ వంటి టీబీ ఔషధాలు, ఐవర్‌మెక్టిన్ వంటి యాంటీపారసైట్ డ్రగ్స్ ధరలు దిగిరానున్నాయి.