న్యూఢిల్లీ, మార్చి 11: ప్రజాస్వామ్య భారత్‌ను నియంతృత్వ దేశంగా మార్చాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకొన్నదని ఆప్ విమర్శించింది. ప్రతిపక్షం లేకుండా చేసి ఏకపార్టీ దేశంగా మార్చాలని చూస్తున్నదని, అందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా శనివారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, దర్యాప్తు సంస్థల తీరును ఎండగట్టారు. దేశాన్ని ‘వన్ నేషన్-వన్ పార్టీ-వన్ లీడర్’ వ్యవస్థగా మార్చేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతున్నదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి సీబీఐ నమోదు చేసిన కేసుల్లో 95 శాతం కేసులు ప్రతిపక్షాలపైనే అని పేర్కొన్నారు.