వారణాసి: రాజకీయాల కోసం శివలింగాన్ని వాడుకోవద్దని కాశీ విశ్వనాథుని ఆలయ మాజీ మహంత్ రాజేంద్ర తివారి సూచించారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందనే వాదనపై ఒక న్యూస్ వెబ్‌సైట్‌తో ఆయన మాట్లాడుతూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇక్కడ ఒక అడుగు ఎత్తున్న గుండ్రని రాతి ఖుంబం దొరికిందని, దీని కింద అర్ఘ్య లేనందున ఇది శివలింగమే అని నమ్మడం మాత్రం కష్టంగా ఉందని ఆయన తెలిపారు. ముందుగా అర్ఘ్య ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ గుండ్రటి రాయి కింద భాగాన్ని తీసి చూడాలన్నారు. స్వయంభు శివలింగం నుదుటిపై ఎలాంటి రంధ్రాలు, పలకలు ఉండవని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో నిజానిజాలను నిర్ధారించడానికి సరైన విచారణ జరగాలని, కానీ రాజకీయాలకు ఉపయోగపడే అంశాన్ని మాత్రమే పట్టుకుంటున్నారని ఆయన అన్నారు.