ముజాఫర్‌నగర్: రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన సమయంలో ఆ క్రికెటర్‌ను ఇద్దరు వ్యక్తులు కాపాడారు. 2022 డిసెంబర్లో ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద ఆ ప్రమాదం జరిగింది. రిషబ్‌ను కాపాడిన ఇద్దరిలో 25 ఏళ్ల రజత్ కుమార్(Rajat Kumar) ఒకడు. కొన్ని రోజుల క్రితం రజత్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్ జిల్లాకు చెందిన అతను ఫిబ్రవరి 9వ తేదీన తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి విషం తీసుకున్నాడు. ఆ అటెంప్ట్‌లో రజత్ గర్ల్‌ఫ్రెండ్ ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
21 ఏళ్ల మనూ కశ్యప్ అనే అమ్మాయిని రజత్ ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు వాళ్ల రిలేషన్‌ను తిరస్కరించారు. దీంతో ఇద్దరూ విషం తీసుకున్నారు. చికిత్స చేస్తున్న సమయంలో మనూ కశ్యప్ ప్రాణాలు కోల్పోయింది. క్రికెటర్ రిషబ్‌ను కాపాడిన రజత్ కుమార్ ప్రస్తుతం క్రిటికల్ కండీషన్లో ఉన్నాడు. ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు.
రజత్, మనూ ఇంట్లో పెద్దలు ఇంకో పెళ్లికి రెఢీ అయ్యారు. కులాలు వేరు కావడం వల్ల వాళ్ల పెళ్లి ప్రయత్నాలు ఫలించలేదు. కశ్యప్ మృతిపై ఆమె తల్లి ఆరోపణలు చేశారు. తన కుమార్తెను కిడ్నాప్ చేసి, విషం ఇచ్చి రజత్ చంపినట్లు ఆమె పేర్కొన్నది.
రిషబ్‌కు ప్రమాదం జరిగిన సమయంలో రజత్ కుమార్‌తో పాటు నిషూ కుమార్ అనే వ్యక్తి క్రికెటర్‌ను కారు నుంచి బయటకు తీశారు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తున్న సమయంలో ఆ ప్రమాదం జరిగింది. మెర్సిడీజ్ కారు మంటల్లో చిక్కుకున్నప్పుడు ఇద్దరూ రిషబ్‌ను రక్షించారు. కోలుకున్న తర్వాత ఆ ఇద్దరికీ స్కూటర్లను డోనేట్ చేశాడు రిషబ్.