(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): విద్యార్హతల విషయంలో రాజస్థాన్ కాంగ్రెస్ మంత్రి లాల్‌చంద్ కటారియా అబద్ధాలు..ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో విధంగా ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో తన విద్యార్హతలను పేర్కొనటం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తొలుత ఇంటర్ పాసైనట్టు, ఆ తర్వాత 10వ తరగతి పాసైనట్టు.. ఇలా నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రకాలుగా తన విద్యార్హతలను వెల్లడించటం ఈసీ దృష్టికి వెళ్లింది. దీంతో కటారియాపై ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలో ఇంటర్మీడియెట్ పాసైనట్టు 2003 ఎన్నికల అఫిడవిట్లో ఆయన తెలిపారు. 2008 ఎన్నికల్లో 10వ తరగతి పాసైనట్లు పేర్కొన్నారు. కటారియా పేరుతో తమ కాలేజీలో ఎవరూ చదువుకోలేదని రాయ్‌బరేలీలోని కాలేజీ ప్రిన్స్‌పాల్ ప్రకటించటంతో, ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.