న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌ను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి కురిసిన వర్షాల ధాటికి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 50 మంది గల్లంతయ్యారు. అనేక ఇండ్లు, వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. కుల్లు జిల్లాలోని నిర్మండ్, సైంజ్, మలానా ప్రాంతాలు, మండీ జిల్లాలోని పధర్, సిమ్లా జిల్లాలోని రాంపూర్లలో భారీ వర్షాలు కురిశాయి. కాంగ్రా, కుల్లు, మండీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీఖండ్ మహదేవ్లో బుధవారం రాత్రి కురిసిన కుండపోత వర్షం వల్ల అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో రాంపూర్‌లో ఇద్దరు మరణించగా, దాదాపు 30 మంది గల్లంతయ్యారు. సిమ్లా డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కాశ్యప్ మాట్లాడుతూ, గల్లంతయినవారిలో నలుగురిని కాపాడినట్లు చెప్పారు. మనాలీ-చండీగఢ్ జాతీయ రహదారిపై చాలా చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు తెలిపారు.