చెన్నై: రైలు పట్టాల వద్ద బోల్టులు తొలగించి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. (bolts removed from rail tracks) దీంతో ఆ ట్రాక్‌పై వెళ్లాల్సిన రైలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పెను ముప్పు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఈ సంఘటన జరిగింది. తిరువళంగాడు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ట్రాక్ అలైన్‌మెంట్‌ను నియంత్రించే పాయింట్ వద్ద కీలకమైనట్లు నట్లు, బోల్టులను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. శుక్రవారం తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో సాధారణ తనిఖీ సందర్భంగా రైల్వే సిబ్బంది దీనిని గుర్తించారు. వెంటనే రైల్వే ఉన్నతాధికారులను అలెర్ట్ చేశారు. స్పందించిన స్టేషన్ మాస్టర్ గ్రీన్ సిగ్నల్ నిలిపివేశారు. దీంతో ఆ ట్రాక్‌పై వెళ్లాల్సిన రైలు ఆగిపోయింది.
కాగా, ఆటోమేటెడ్ సేఫ్టీ సిస్టమ్ కారణంగా పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. తిరువళంగాడు స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ప్యానెల్‌పై రెడ్ వార్నింగ్ లైట్ చూసి అప్రమత్తమైనట్లు చెప్పారు. వెంటనే గ్రీన్ సిగ్నల్ నిలిపివేసి వస్తున్న రైలును ఆపివేసినట్లు వివరించారు.
ఒకవేళ స్టేషన్ మాస్టర్ సిగ్నల్‌ను క్లియర్ చేసి ఉంటే లూప్ లైన్లోకి మళ్లిన ఆ రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉందని రైల్వే అధికారి తెలిపారు. సాంకేతిక సిబ్బందిని అక్కడకు పంపి తొలగించిన నట్లు, బోల్ట్లను సరిచేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.