న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ఇవాళ బడ్జెట్‌పై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో రాహు కాలం నడుస్తోందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని సీనియర్ సభ్యులు వీడి వెళ్తున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సీనియర్ నేతలు ఆ పార్టీపై తిరుగుబాటు చేసిన విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. రాహు కాలం వల్లే కాంగ్రెస్‌లో జీ-23 ఉత్పాతం మొదలైనట్లు ఆమె ఆరోపించారు. ఇటీవల సుమారు 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆ పార్టీ వైఖరిని ఖండిస్తూ అధిష్టానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అమృత కాలం కాదు అని.. దేశంలో 2014 నుంచి రాహు కాలం నడుస్తోందని కాంగ్రెస్ నేత ఒకరు తన ప్రసంగంలో ఆరోపించారు. ఇవాళ ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం అమృత కాలంలో ఉన్నట్లు మంత్రి సీతారామన్ వెల్లడించారు. రాహు కాలం ఉన్న చోట.. కాంగ్రెస్ పార్టీ కంకషన్‌కు గురైందన్నారు. రాజస్థాన్‌లో మహిళలకు ప్రతి రోజూ ఏదో కీడు జరుగుతోందని, అక్కడ రాహు కాలం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు ఆ పార్టీని వీడి వెళ్తున్నట్లు ఆమె చెప్పారు. అదే రాహు కాలం అవుతుందన్నారు. రాహు కాలంలో ఉండడం వల్లే ఆ పార్టీకి 44 సీట్లు మాత్రమే వచ్చినట్లు మంత్రి నిర్మల విమర్శించారు.