భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభండార్(Puri Ratna Bhandar)ను గురువారం మళ్లీ తెరవనున్నారు. రత్న భండార్‌లోని లోపలి గదిని తెరవనున్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్(ఎస్జేటీఏ) పేర్కొన్నది. లొపలి గదిలో ఉన్న ఆభరణాలను తాత్కాలిక రూమ్‌కు తరలించేందుకు గురువారం రోజున మళ్లీ రత్నభండార్‌ను తెరవనున్నారు. ఆదివారం రత్న భండార్‌ను 46 ఏళ్ల తర్వాత ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.
ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పదే, జస్టిస్ బిశ్వంత్ రాథ్, పూరీ కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వెయిన్‌తో పాటు ఇతర అధికారులు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 18వ తేదీన ఉదయం 9.51 నిమిషాల నుంచి 12.15 నిమిషాల మధ్య కాలంలో రత్న భండార్ తాళాలను ఓపెన్ చేస్తామని, అక్కడ ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక రూమ్‌కు తరలిస్తామని, పురావాస్తుశాఖ అధికారులు తమకు సహకరిస్తారని, ఈ ఈవెంట్‌ను మొత్తాన్ని వీడియోగ్రాఫ్ చేస్తామని జస్టిస్ రాథ్ తెలిపారు.
ఆభరణాలను ఉంచే తాత్కాలిక ప్రదేశం వద్ద సీసీటీవీలను అమర్చనున్నట్లు చెప్పారు. అగ్ని రక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. జూలై 18వ తేదీన ఆలయ నిర్వాహకులు విధించే నిబంధనలకు కట్టుబడి భక్తులు ఉండాలని ఎస్జేటీఏ తన అప్పీల్లో కోరింది. లొపలి గదిలో బాక్సులు, అల్మిరాలను బృందం వీక్షించిందని. అయితే బహుదా యాత్ర, సునా బేషా ఈవెంట్ల నేపథ్యంలో బంగారు ఆభరణాలను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించేందుకు నిరాకరించినట్లు జస్టిస్ రాథ్ తెలిపారు.
బయటి గదిలో ఉన్న విలువైన వస్తువులను చాంగ్డా మేకప్ స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించినట్లు జస్టిస్ రాథ్ తెలిపారు. లోపలి గదికి చెందిన తాళం చెవులను ఏఎస్ఐకి ఇవ్వబోమని, నియమావళి ప్రకారమే తాళాలు తీయనున్నట్లు పథే తెలిపారు.