చండీఘడ్: అమెరికాలో ఓ ఎన్ఆర్ఐ కుటుంబాన్ని బెదిరించి వసూళ్లకు పాల్పడిన కేసులో పంజాబీ పోలీసు గురిందర్జీత్ సింగ్ నగ్రా(Gurinderjit Nagra)ను అరెస్టు చేశారు. హోషియార్‌పూర్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ ఆ పోలీసు ఆఫీసర్‌ను వాంటెడ్ లిస్టులో చేర్చిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న ఓ కుటుంబం నుంచి సుమారు 4 లక్షల డాలర్లు వసూల్ చేసినట్లు గురిందర్జీత్ సింగ్‌పై ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ జగ్గూ భగవాన్‌పురియా ముఠాకు అతను సహకరించినట్లు తెలిసింది. బెదిరింపు వసూళ్లు, అవినీతి కేసు అతనిపై నమోదు చేశారు. హత్య, బెదిరింపులు, డ్రగ్ ట్రాఫికింగ్, ఇతర వ్యవస్థీకృత నేరాల్లో భాగమైన వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ హార్ట్బాల్ను అమెరికా చేపట్టింది.
అమెరికా, కెనడా, యూరోప్ దేశాల్లో నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకున్నారు. అయితే పంజాబ్‌లోని తాండా పోలీసు స్టేషన్లో ఆఫీసర్‌గా ఉన్న నగ్రా.. గ్యాంగ్స్టర్లతో చేతులు కలిసి లాస్ ఏంజిల్స్‌లోని ఓ కుటుంబం నుంచి 4 లక్షల డాలర్లు వసూల్ చేసినట్లు తెలింది. ఇండియాలో ఉన్న తమ బంధువులపై కేసు బుక్ చేస్తున్నామని బెదరిస్తూ అతను వసూళ్లకు తెగించినట్లు తెలిసింది. ముందస్తుగా ఎస్‌హెచ్‌వో నగ్రాను విధుల నుంచి తప్పించారు. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు హోషియార్‌పుర్‌లో ఎస్ఎస్పీ సందీప్ కుమార్ మాలిక్ తెలిపారు.