ముంబై, జూలై 3 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర పుణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక పోష్ రెసిడెన్షియల్ సొసైటీలో కొరియర్ డెలివరీ పేరుతో వచ్చిన ఒక వ్యక్తి ఫ్లాట్‌లోని యువతిపై లైంగిక దాడి చేయడమే కాక, బాధితురాలి ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని, అందులో తాను తిరిగి వస్తానని బెదిరింపు మెసేజ్ కూడా పెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం.. అకోలాకు చెందిన 22 ఏండ్ల ఒక యువతి పుణెలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నది. తన సోదరుడితో కలిసి కొంధావా ప్రాంతంలో నివసిస్తున్నది. అయితే, ఆమె సోదరుడు ఊరు వెళ్లడంతో ఆమె ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంది.
బుధవారం రాత్రి 7 -7:30 గంటల ప్రాంతంలో నిందితుడు ఆమె ఫ్లాట్ దగ్గరకు వచ్చి, తాను కొరియర్ బాయ్ అని, ఆమె పేరున పార్సిల్ ఉందని సంతకం పెట్టి తీసుకోవాలని అన్నాడు. తన దగ్గర పెన్ను లేదని అతడు చెప్పడంతో ఆమె దానిని తేవడానికి వెళ్లగా లోపలికి ప్రవేశించిన నిందితుడు ముఖంపై మత్తుమందు స్ప్రే చేశాడు.
స్పృహ తప్పిన ఆమెపై లైంగిక దాడి చేయడమే కాక, ఆమె ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని మళ్లీ వస్తానంటూ మెసేజ్ పెట్టాడు. ఇది ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానంటూ బెదిరించాడు. కాగా, దీనిపై ఫిర్యాదు అందడంతో పలు బృందాలను నియమించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 5) రాజ్ కుమార్ షిండే తెలిపారు.