న్యూఢిల్లీ: పుణె అత్యాచార(Pune Rape Case) ఘటన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని గురువారం అరెస్టు చేశారు. 26 ఏళ్ల మహిళను.. నిందితుడు దత్తాత్రేయ రామ్‌దాస్ గాదె .. బస్సులో రేప్ చేశాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. అయితే నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. వంద మంది పోలీసులు.. 13 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు డ్రోన్లను వాడారు. దాదాపు 75 గంటల తర్వాత రేప్ నిందితుడు దత్తాత్రేయ్ గాదెను అదుపులోకి తీసుకున్నారు.
రేప్ చేసి పరారీ అయ్యే క్రమంలో నిందితుడు తన షర్ట్ మార్చుకున్నాడు. అయితే షర్ట్ ఆధారంగా పోలీసులు జాగిలాలు అతని వాసన గుర్తుపట్టాయి. దాని ద్వారా అతను పారిపోయిన రూట్‌ను ఆ శునకాలు పసికట్టాయి. తమ బంధువులకు చెందిన చెరుకు తోటలో రాందాస్ దాక్కున్నాడు. కాలువ సమీపంలో ఉన్న చెరుకుతోటలో అతను ఉన్నట్లు అక్కడి గ్రామస్థులు గుర్తించారు. స్వర్గతే పోలీసు స్టేషన్ చెందిన సిట్ బృందం అతన్ని అరెస్టు చేసింది.
రాందాస్ గాదేపై అనేక కేసులు ఉన్నాయి. అతని స్వస్థలం పుణె జిల్లాలోని షిరూర్. క్రిమినల్ చరిత్ర పెద్దదే. వేర్వేరు పోలీసు స్టేషన్లలో అతనిపై ఆరు కేసులు ఉన్నాయి. షిరూర్తో పాటు అహల్యానగర్ జిల్లాలోని షికార్పూర్లోనూ కేసు ఉన్నది. 2019లో రుణంపై కారును తీసుకుని .. పుణె, అహల్యానగర్ రూట్లో ట్యాక్సీగా నడిపాడు. అయితే ఆ సమయంలో అతను అనేక నేరాలకు పాల్పడ్డాడు. డ్రాపింగ్ పేరుతో వయసు మీరిన మహిళలను పరిచయం చేసుకుని, కారు ఎక్కిన తర్వాత వాళ్లను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, కత్తితో బెదిరించి వారి వద్ద ఆభరణాలు, డబ్బులు ఉంటే లాక్కునేవాడు. అలాంటి కేసుల్లో అరెస్టు అయిన తర్వాత అతని వద్ద నుంచి 140 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు.
వైద్య రంగంలో పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళ.. ఘటన జరిగిన రోజున బస్సు కోసం వెయిట్ చేస్తోంది. సతారా జిల్లాలోని ఫల్టన్‌కు వెళ్లేందుకు ఆమె బస్సు కోసం స్టాప్‌లో నిలుచున్నది. ఉదయం 5.45 నిమిషాల సమయంలో.. రాందాస్ గాదే ఆమె వద్దకు వచ్చి బస్సు మరో చోట పార్కింగ్ చేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత మాటల్లో దించేసి.. శివ్ సాహి ఏసీ బస్సు వద్దకు తీసుకెళ్లాడు. బస్సులో ఎవరూ లేకపోవడంతో ఆమె ఎక్కేందుకు నిరాకరించింది. కానీ తన మాటలతో మోసం చేసి ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు.