లక్నో, అక్టోబర్ 4: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటనలో మరణించిన నలుగురు రైతు కుటుంబాలను పరామర్శించేందుకు సోమవారం విపక్ష నేతలు లఖింపూర్ ఖీరీకి ప్రయాణమయ్యారు. అయితే, శాంతి-భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదమున్నదన్న కారణంతో పోలీసులు ఎక్కడివారినక్కడే నిర్బంధించారు. మరికొందరిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సీతాపూర్ జిల్లాలో నిరాహారదీక్ష చేపట్టారు. కేంద్రమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను లక్నోలోని ఆయన ఇంటివద్దే పోలీసులు నిర్బంధించారు. దీంతో ఆయన ఇంటి బయటే నిరసన ప్రదర్శన చేపట్టారు. బ్రిటిషర్ల కాలంలో కూడా చూడనటువంటి దారుణాలు బీజేపీ హయాంలో రైతులపై జరుగుతున్నాయని మండిపడ్డారు. లఖింపూర్ ఖీరీకి ప్రయాణమైన బీఎస్పీ, ఆప్ తదితర పార్టీల నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, లఖింపూర్ ఖీరీ ఘటనను నిరసిస్తూ ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులు భారీఎత్తున ఆందోళనలు చేపట్టారు. కాగా లఖింపూర్ ఖీరీలో ఆదివారం జరిగిన ఘటనలో ఒక జర్నలిస్టు కూడా మరణించినట్టు సమాచారం. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను నిరసిస్తూ తికునియా-బన్బీపూర్ మార్గంలో ఆదివారం నిరసనలు చేస్తున్న రైతుల మీదకు మంత్రి కుమారుడి కాన్వా య్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ఇతరు లు మరణించారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతుల మీదకు కారును తోలాడని రైతులు ఆరోపించగా, ఘటన సమయంలో తన కుమారుడు అక్కడ లేడని మంత్రి తెలిపారు.
డిమాండ్లు నెరవేరేదాక దహనం చేయబోం: టికాయిత్
లఖింపూర్ ఖీరీ ఘటన గురించి తెలియగానే సోమవారం ఉదయం లఖింపూర్ ఖీరీకి చేరుకున్న భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్.. జిల్లా అధికారులకు ఒక మెమోరండం సమర్పించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి మిశ్రా పదవికి రాజీనామా చేయాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారాన్ని చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు.డిమాండ్లు నెరవేరేంతవరకూ రైతుల మృతదేహాలను దహనం చేయబోమన్నారు.
కేంద్రమంత్రి కుమారుడిపై కేసు
లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. మరణించిన నలుగురు రైతు కుటుంబాలకు రూ. 45 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
స్టే విధించాక.. నిరసనలేంటి: సుప్రీంకోర్టు
నూతన వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే స్టే విధించామని.. అలాంటప్పుడు మళ్లీ నిరసనలు చేయడం ఏమిటని సుప్రీంకోర్టు రైతు సంఘాలను ప్రశ్నించింది. ఇది రెండు గుర్రాలపై స్వారీ చేయడమేనని అభిప్రాయపడింది. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేపట్టేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రైతు సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై విచారించిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా లఖింపూర్ ఖీరీ ఘటన ప్రస్తావనకు రాగా.. అలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవ్వరూ బాధ్యత వహించబోరని కోర్టు అభిప్రాయపడింది.